**1.9. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః |
నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ||**
**వ్యాఖ్య:** 'అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః' — ఇప్పటివరకు నేను పేర్కొన్న నా సేనాపతులతోపాటు, బాహ్లీకుడు, శల్యుడు, భగదత్తుడు, జయద్రథుడు మొదలైన మరెందరో మహావీరులు కూడా మా సైన్యంలో ఉన్నారు. వారు నా మేలు కోసమూ, నా తరపున పోరాడటం కోసమూ, ప్రాణాలపై ఆశ వదలుకొని ఇక్కడికి వచ్చారు. వారు నా విజయం కోసం ప్రాణాలు అర్పించేయవచ్చు, కాని యుద్ధభూమి నుండి ఎన్నటికీ వెనుదిరగరు. వారికి నా కృతజ్ఞతను మీ ముందు ఎలా వ్యక్తం చేయగలను?
'నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః' — ఈ వీరులందరూ కత్తి, గద, త్రిశూలం మొదలైన నానావిధమైన హస్తాయుధాలను వాడటంలోనూ, బాణాలు, తోమరాలు, శక్తులు మొదలైన ప్రయోగాస్త్రాలను ఎయ్యటంలోనూ నిపుణులు. అంతేకాకుండా యుద్ధకళలో — యుద్ధం ఎలా చేయాలి, ఏ పద్ధతిలో, ఏ వ్యూహాలు, ఏ యుక్తులు అవలంబించి దాన్ని నడపాలి, సేనను ఎలా అమర్చాలి మొదలైన విషయాలలో — అత్యంత ప్రవీణులు, నిష్ణాతులు.
**సందర్భం:** దుర్యోధనుని మాటలు విన్న తర్వాత ద్రోణాచార్యులు మౌనం దాల్చగా, తన కపటం ఫలించక పోవటంతో దుర్యోధనుని మనస్సులో ఏ ఆలోచన పుట్టింది — దానిని గురించి సంజయుడు తర్వాతి శ్లోకంలో వివరిస్తున్నాడు.
★🔗